ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు: వికేంద్రీకరణ అజెండా లేక రియల్ ఎస్టేట్ బొనాంజా?

వైసీపీ అధికారంలోకి రాగానే సౌతాఫ్రికా తరహాలో – విశాఖపట్నంని పరిపాలనా రాజధాని గానూ, అమరావతిని శాసన రాజధానిగానూ, కర్నూలుని న్యాయ రాజధానిగానూ- మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించింది.  ఇది పాలనా వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధి – మరీ ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలయిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ అభివృద్ధి కోసం తోడ్పడుతుందన్నది ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు, దీన్ని ప్రపంచస్థాయి నగరంగా (world class city) అభివృద్ధి చేయాలని తలపెట్టింది.  అయితే ఈ కేంద్రీకృత రాజధాని నమూనా  ఆర్ధికంగానూ, పర్యావరణం పరంగానూ, లేదా ఉద్యోగ అవకాశాల పరంగానూ వెసులుబాటులేని, సాధ్యం కాని ఒక ప్రాజెక్ట్ అనిఅనేక మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే విధంగా, టీడీపీ ప్రభుత్వంలో అమరావతి ప్రాజెక్ట్ కి సంబందించి భూ అవకతవకలు, ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అందులో భాగంగానే అమరావతి రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్ట్ ల సమీక్షలు, కమిటీలు వేసి వాటి నివేదికలు ఆధారంగా ముందు కాంట్రాక్ట్ లను రద్దు చేయడం, రివర్స్ టెండెరింగ్ లాంటి చర్యలను చేపట్టింది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు ఆదాఅయినట్లు కూడా ప్రకటనలు చేసారు.

ఈ మూడు రాజధానుల ప్రకటన వల్ల అమరావతి రాజధాని ప్రాంతం (capital region) చుట్టూ  విపరీతంగా పెరిగిన భూమివిలువలు, భూలావాదేవీలు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వంలో జరిగిన భూసమీకరణ (land pooling) లపై  ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అందులో భాగమై ఉన్న చిన్న, సన్నకారు రైతులు బాగా నష్టపోయారు. ఈ పరిస్థితుల వలన, రాజధాని ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది కౌలుదార్లు, భూముల్లేని దళితలు, స్త్రీలు (వీళ్లంతా వ్యవసాయ కూలీలు) ఎక్కువగా నష్టపోయారు. కానీ, నేటికీ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే నాథుడే లేడు. నాటి రాజధాని ప్రాంతానికి చుట్టప్రక్కల 29 గ్రామాలకి చెందిన రైతులు తమ ఆదాయాన్ని అద్దెలు (ఇళ్ళు వలన గానీ, కమర్షియల్ ప్రాపర్టీస్ వలన గానీ) ద్వారా పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో పెట్టుబడి పెట్టారు. కానీ ఈ మూడు రాజధానులు నిర్ణయంతో వాళ్ళ అవకాశాలు బాగా సన్నగిల్లాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల గురించి రోజు వారి చర్చల్లో ఏంటి అని చెప్పుకున్నట్లయితే, ప్రధానంగా, రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడమే. వివిధ వర్గాలకు చెందిన రైతులు, రాజకీయ పార్టీలు గత 18 నెలలుగా ‘జాయింట్ ఏక్షన్ కమిటీ’ గా ఏర్పడి, ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వైఖరి మునుపటి ప్రభుత్వం కంటే భిన్నంగా ఏమీలేదు. నాటి ప్రభుత్వం ఎలాగైతే అమరావతి విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధమయిన చర్చకి తావు ఇవ్వలేదో, నేడు వైసీపీ ప్రభుత్వం కూడా నిరసనకారులతో గానీ , రైతు సంఘాలతో గానీ, రాజకీయ పార్టీలతో గానీ ఒక చర్చను పెట్టి ఈ మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించకలేకపోయింది. ఆలా చేయకపోగా, 144 సెక్షన్, సెక్షన్ 30 (పోలీస్ చట్టం) విధిస్తూ.. నిరసనకారుల్ని (మహిళలని కూడా) కొట్టి వారిని అదుపులోకి తీసుకోవడం వంటివి జరిపింది.

ఈ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం నగరం భూపంపకాలకి, అమ్మకాలకి, ఆక్రమణలకి, లీజులకి – ఒక్క మాటలో చెప్పాలంటే భూ దందాలకి కేంద్రంగా నిలిచింది. విశాఖపట్నంలో చాలా భూమి… ప్రభుత్వం ఆధీనంలోనే ఉండటం గమనించదగ్గ విషయం. విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వెంటనే, ప్రభుత్వం భూసమీకరణకు ప్రయత్నించగా దాన్ని గట్టిగావ్యతిరేకించడoతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆ తరువాత కూడా, చాలా ప్రభుత్వ భూమి, ఉమ్మడి ప్రదేశాలు (urban commons) ఆక్రమణకి గురవ్వడం, ప్రైవేట్ వ్యక్తుల పరమవ్వడం జరుగుతూనే ఉంది. గమించినట్లయితే, విశాఖపట్నం-భీమిలి మధ్యలో సుమారు 25 కి.మీ. విస్తరణలో చాలా భూమి రియల్ ఎస్టేట్ వ్యక్తులు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుత ప్రభుత్వo బిల్డ్ ఏపీ (Build AP) ప్రాజెక్ట్ లో భాగంగా, ప్రభుత్వ భూముల్ని గుర్తించి వివిధ రకాల మౌలికవసతులు కల్పించి, నిర్మాణానికై ప్రైవేట్ వ్యక్తులకి, ఇతర సంస్థలకి అమ్మడం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటిదాకా గుర్తించిన చాలా భూమి విశాఖపట్నంకి చెందిందే కావడం గమనార్హం. సిటీలో ప్రధాన ప్రాంతమైన ఆర్ కె బీచ్ రోడ్ లో హార్బర్ పార్క్ దగ్గరున్న 13.59 ఎకరాల ప్రభుత్వ భూమిని, అప్పటి టీడీపీ ప్రభుత్వం UAE కి చెందిన Lulu గ్రూపుకి లీజుకి ఇవ్వడం జరిగింది. దానిని 2019 లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి, అదే భూమిని (coastal regulation zone- CRZ II పరిధిలో ఉన్నప్పటికీ; అంటేఆ భూమిని CRZ చట్టం ప్రకారం ప్రైవేటుపరం చేయడం కుదరదు) ఇప్పుడు పూర్తి అమ్మకానికి పెట్టింది. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్, తహిసీల్ధార్ ఆఫీస్ లు, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, R& B ఆఫీస్, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్స్ , ITI, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రభుత్వ డైరీ ఫార్మ్, వికలాంగ శిక్షణా కేంద్రం ఉన్నటువంటి వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడానికి, లీజు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియంతా ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మడం ద్వారా డబ్బును సమకూర్చుకోవడం తప్ప మరొకటి కాదు. తీరాన్ని ఆనుకొనున్న విశాఖపట్నం సహజంగానే తుఫానులు, వరదలు, సునామీలకి గురయ్యేటటువంటి ప్రాంతం. ప్రభుత్వం పర్యావరణ నిబంధనల్ని ఉల్లఘింస్తూ, కొండల్ని ఆక్రమించుకోవడం, నిర్మాణాలు చేపట్టడం, భూముల్ని యధేఛ్చగా వాడుకోవడం వంటి విధానాలు గమనిస్తుంటే…. ఇవన్నీ విశాఖపట్టణ అభివృద్ధిని మరింత అస్థిరపరిచే అంశాలుగానే కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఇవన్నీ చూస్తుంటే, అమరావతి లాగానే ఇంకో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా కనిపిస్తుంది. కానీ ఇది అలా మిగిలిపోకూడదు.

అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ కి సంబందించిన కొన్ని ప్రధాన నిర్ణయాలు కూడా ఇటీవల తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న రైల్వే ఆస్తుల అమ్మకాలతో పాటు, స్టీల్ ప్లాంట్ మరియు దానికి సంబందించిన సుమారు 22,372 ఎకరాల భూమిని విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా, విశాఖపట్నం పోర్ట్, ఇనుము ధాతు కర్మాగారాలని (iron ore plant) అదానీ, వేదాంత గ్రూప్ లాంటి కార్పోరేట్లుకి విక్రయించడం జరిగింది. గంగవరం పోర్టులో ప్రభుత్వంకున్న 1800 ఎకరాల భూమికి (అంటే, 21% వాటా) ఆదాయంనూ , మిగిలిన 1052 ఎకరాల భూమికి అద్దెనూ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పొందుతోంది. అయితే ఇప్పుడు అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కి గంగవరం పోర్టుని పూర్తిగా అమ్మడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే విధంగా కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) లో ప్రభుత్వానికున్న 51% వాటాని అరబిందో గ్రూపుకి అమ్మకం పెట్టారు. అలాగే, తూర్పు తీరం నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉన్న 100% వాటాని అదానీ గ్రూపు కొనుక్కోవడానికి సహకరించారు, సముద్ర పర్యావరణాన్ని పట్టించుకోకుండా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ గ్రూపు ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చారు. టీడీపీ హయాంలో అప్పుడు విపక్షంగా ఉన్న వైసీపీ భోగాపురం ఎయిర్ పోర్టుకి సంబందించిన భూసేకరణ ప్రక్రియని అడ్డుకున్నప్పటికీ, ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చాక, 500 ఎకరాల భూమిని  తాను అభివృద్ధి చేస్తూ, మిగిలిన 2200 ఎకరాలను అధునాతన అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా అభివృద్ధి చేయడానికి GMR Air Ports Ltd తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని పర్యవసానంగా అక్కడున్న చిన్న, సన్నకారు రైతులు రెండు ప్రభుత్వాల చేతిల్లోనూ (టీడీపీ, వైసీపీ) ఆ ప్రాంతం నుంచి తొలిగించబడ్డారు. అయితే, ఒక వైపు ప్రభుత్వ ఆస్తుల్ని లీజుకి ఇచ్చో, అమ్మకానికి పెట్టో డబ్బుని సమకూర్చుకుంటూ, కార్పోరేట్లు సంస్థలకు అన్ని అప్పచెప్తున్న ఏపీ ప్రభుత్వానికి, స్టీలు ప్లాంటుని, పోర్టులని అమ్మకానికితలపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏమీ లేకపోగా, కేంద్రాన్ని ప్రశ్నించి, నిలదీసే నైతికత ఎలా వస్తుంది?

కార్పోరేట్లుకి ఉపయోగపడే విధంగా విధానాలు తీర్చుదిద్దుకోవడం, ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టడం, భూ ఒప్పందాలు కుదుర్చుకోవడం, పేదలకి ఇళ్ల పేరుతో దళితులకి కేటాయించిన భూముల్ని లాక్కోవడం, పట్టణ, విద్యుత్ మరియు ఆస్థి పన్నుల్లో సంస్కరణలు తీసుకురావడం లాంటివే ఈ ప్రభుత్వం యొక్క ‘అభివృద్ధి నమూనా’ గా ప్రతిభింబిస్తున్నాయి తప్ప.. పరిశ్రమల్ని స్థాపించి, ఉపాధి అవకాశాల్ని సృష్టించి అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు కనిపించట్లేదు. ఇదిలా ఉంటే, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ బాధితులయిన రైతులు, రైతు కూలీలకి (ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు) 2013 LARRA చట్టం క్రింద తగిన పరిహారం ఇవ్వకుండానే వారిని అక్కడనుంచి వెళ్లగొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.

అందువల్ల ఈ మూడు రాజధానుల నిర్ణయం… ప్రభుత్వం చెప్తున్నట్లు పాలనా వికేంద్రీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధిలో భాగమా లేక ప్రభుత్వం చేసే భూదందాకి ‘వికేంద్రీకరణ’ అనేది ఒక ముసుగా? ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రజాప్రయోజనాలకు కేంద్రంగా గల రాజధాని లేదా రాజధానుల్ని పునః రూపకల్పన మరియు పునః నిర్మాణము చేసుకోకుండా ఒక చారిత్రక అవకాశాన్ని చేజార్చుకుంటోందా?

ప్రొ. పురేంద్ర ప్రసాద్,

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం